నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం కొన్ని సౌత్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్. తరచుగా పూనమ్ కౌర్ తన అభిప్రాయాలని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అది కూడా పరోక్షంగా మాత్రమే. ప్రస్తుతం సొసైటీ లో హాట్ టాపిక్ గా మారిన అంశాన్ని తీసుకుని దాని గురించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం పూనమ్ కౌర్ కి అలవాటు. 

పూనమ్ కౌర్ తరచుగా చేసే కొన్ని ట్వీట్స్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని ఆయన అభిమానులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ తాజాగా అయోధ్య అంశం గురించి పరోక్ష వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకే కేటాయిస్తూ సుప్రీం కోర్టు శనివారం రోజు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.  

'నాకు ఈ విషయం గురించి ఆశ్చర్యంగా ఉంది.. హర్ట్ అయ్యాను కూడా. గత 70 ఏళ్లలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ఈ నిర్ణయం పట్ల కనీసం కృతజ్ఞత తెలుపకుండా కొంతమంది సైలెంట్ గా ఉండిపోయారు. ఇలాంటి వారంతా స్వార్థం కోసం, పబ్లిసిటీ కోసం, ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతారు అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది'. 

గత 70 ఏళ్ళలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే కొందరు రాజకీయ నాయకులు కనీసం మాట్లాడడం లేదని పూనమ్ కౌర్ ఇలా పరోక్షంగా ట్వీట్ చేసింది. శతాబ్దాల కాలంగా వివాదంగా మారిన అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు అంశానికి ధర్మాసనం శనివారంతో ఫుల్ స్టాప్ పెట్టింది. 

2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ముస్లింల మసీద్ నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం స్వయంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలని రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.