పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన పింక్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

ఈ సినిమా తరువాత చేయబోయే  సినిమా పనులు కూడా ప్రారంభించాడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్. వకీల్‌ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు పవన్. ఈ సినిమాలో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా బందిపోటు పాత్రలో నటించనున్నాడట. పవన్‌ తొలిసారిగా ఓ కాస్ట్యూమ్ డ్రామాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో పవన్‌ తో కలిసి ఓ తెలుగమ్మాయి ఆడిపాడనుంది. రంగస్థలం, కల్కి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన తెలుగమ్మాయి పూజితా పొన్నడా పవన్‌తో కలిసి ఆడిపాడనుందట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.