ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా మన్ననలు అందుకున్న కోహినూర్ చుట్టూ మొదటి నుంచి మన దేశంలో చర్చ జరుగుతోంది. ఆ వజ్రం అసలు యజమాని ఎవరు అనేది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. మరో ప్రక్క వలస పాలన రోజుల్లో బ్రిటన్ పాలకులు దానిని భారత్ నుంచి అపహరించుకు వెళ్లారన్న వాదన ఉంది. అయితే ఆ విషయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించింది. అది కానుక అని తేల్చి చెప్పింది. 

అయితే ఇప్పుడీ కోహినూర్ వజ్రం గొడవ ఎందుకు అంటే...పవన్ కళ్యాణ్ తాజా చిత్రంలో ఆ వజ్రం కోసం పోరాడబోతున్నారట. క్రిష్, పవన్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో స్టోరీలైన్ ఈ విషయం చుట్టూనే తిరగనుందని తెలుస్తోంది.    కాకతీయుల రాజ్యం నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వజ్రాన్ని ఎత్తుకెల్లాడనే చరిత్రలో ఓ వాదన ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈకథ తయారు చేసారట.  కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఖజానాలో  ఈ వజ్రం కొంత కాలం ఉంది. 1,310లో ఢిల్లీ సుల్తానుతో సంధి చేసుకున్న ఆయన.. ఈ వజ్రాన్ని సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ రాజుల వద్ద ఉన్న కోహినూర్... మొదటి పానిపట్టు యుద్ధం తరువాత బాబర్ చేతికి వెళ్లిందని అంటారు. అలా చాలా మంది చేతులు మారి, చివరకు 1850లో బ్రిటీష్ రాజుల చేతుల్లోకి వెళ్లింది.

ఈ సినిమాలో పవన్ ఆ వజ్రం దొంగతనం చేయబోతారట. ఈ వజ్రాన్ని ఎత్తుకెళ్లడానికి కొంతమంది బందిపోట్లు సాయింతో  ప్రయత్నిస్తారని చెప్తున్నారు. షాజహాన్ ఆస్థానంలోని నెమలి సింహాసనం లో ఆ వజ్రం పొదిగి ఉంటుంది. ఆ వజ్రాన్ని కాజేయడానికి హీరో చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుందంటున్నారు. అయితే ఇది రూమరా..లేక నిజమా అనేది తెలియాల్సి ఉంది.  ఇక ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో పవన్  బందిపోటుగా నటిస్తున్నారని చెప్తున్నారు. పవన్ ఇప్పటికే 'పింక్'  సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే క్రిష్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తారని తెలుస్తుంది.