అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల కారణంగా లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ సూపర్ హిట్ సినిమా పింక్‌ను తెలుగులో పవన్ హీరోగా వకీల్ సాబ్‌ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమ షూటింగ్ మేజర్‌ పార్ట్ పూర్తయ్యింది. ఈ లోగా కరోనా కారణంగా లాక్ డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ డేట్‌ కూడా మారుతుందన్న టాక్ వినిపిస్తోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోని కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా మే 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం షూటింగ్ తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వాయిదా పడటంతో ముందుగా అనుకున్నట్టుగా మే 15న సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో నిర్మాతలు రిలీజ్ డేట్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. మేలో కాకుండా సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో చాలా కాలంగా పవన్‌ను వెండితెర మీద చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా పవన్ ఇప్పటికే కన్ఫమ్‌ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పాడు పవన్. ఈ సినిమాలో పవన్ రాబిన్‌ హుడ్ తరహా బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తోంది.