నటుడు నుంచి రాజకీయ నాయకుడుగా టర్న్ అయిన పవన్ కళ్యాణ్ రీఎంట్రీ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా చేస్తారని కొంతమంది..అబ్బే అలాంటిదేమీ లేదు, రాజకీయాలకే పరిమితం అంటూ మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరేమన్నా..ఏమనుకున్నా ఈ విషయమై పవన్ మాత్రం పెదవి విప్పటం లేదు. కానీ ఆయన ఎఎమ్ రత్నం నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నారని, ఆ మేరకు దర్శకుల దగ్గర నుంచి కథలు వింటున్నారని మాత్రం గట్టిగా వినపడుతోంది.

అయితే తాజాగా మీడియాలో మరో వార్త పవన్ రీఎంట్రీ గురించి మొదలైంది. ఆయన ఓ సబ్జెక్టు ని ఖరారు చేసారని, దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేస్తున్నారని ఆ వార్త సారాంశం. ఇంతకీ ఏమిటా సబ్జెక్టు అంటే...హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ రీమేక్‌ అఫీషియల్ రీమేక్  అని తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు కేవలం ఇన్ఫర్మేషన్ గా ఉన్న విషయం ఇప్పుడు  కన్ఫర్మేషన్ వచ్చిందని అంటున్నారు.  

 

ఈ మూవీని గబ్బర్ సింగ్‌తో పవన్‌కు సాలీడ్  హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం. సంక్రాంతికి ఈ సినిమా మొదలు పెట్టనున్నారు. జనవరి 2020లో షూటింగ్ మొదలై వేసవిలో విడుదల అవుతుందట. ఈ సినిమా తన రాజకీయ కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని, తమ పార్టీ సిద్దాంతాలను పనిలో పనిగా ప్రచారం చేసినట్లు ఉంటుందని ఓకే చేసారట. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తారు అంటున్నారు. కానీ పింక్ రీమేక్ రైట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయ కాబట్టి ఆయన కూడా పార్టనర్ గా ఉండే అవకాసం ఉంది.

మొదట ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తాడని వార్తలు చాలా రోజులు హల్‌చల్ చేశాయి. కానీ బాలయ్య ఎందుకో ఆ పాత్రను పట్టించుకోలేదు.   ఇక ఇప్పటికే ఈ సినిమాని తమిళంలో  అజిత్ హీరోగా నేర్కొండ పార్వైగా రీమేక్ చేసారు. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే సమాచారం నిజమైతే పెద్ద హిట్ వచ్చినట్లే. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హరీష్ శంకర్ ఈ కథను మార్చేస్తున్నట్లు వార్త. ఇదే కనుక నిజమైతే మరికొద్దిరోజుల్లోనే పవన్  ఫ్యాన్స్ సంతోషపడే ఎనౌన్స్మెంట్ వస్తుంది.