మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సినీ ప్రయాణం నెమ్మదిగా ప్రారంభమైంది. మొదట్లో వరుణ్ తేజ్ కు ఆశించిన సక్సెస్ దక్కలేదు. అయినప్పటికీ వరుణ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించేందుకు వెనకడుగు వేయలేదు. కమర్షియల్ సినిమాలే చేయాలి అనే నిబంధన పెట్టుకోలేదు. 

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్స్ వరుణ్ ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ మరో ఆసక్తికర చిత్రానికి రెడీ అవుతున్నాడు. 

డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 10వ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బాక్సింగ్ ప్రధానాంశంగా ఉండబోతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్ర కథ ఆధారంగానే కిరణ్ కొర్రపాటి వరుణ్ తేజ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడట. జానీ మంచి మూవీ అని చాలా మంది అభిమానులు అభిప్రాయపడతారు. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కిరణ్ కొర్రపాటి మాత్రం జానీ చిత్రంలోని పాయింట్ ని తీసుకుని అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. 

జానీ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. భారీ బడ్జెట్ లో తెరకెక్కే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ఇస్మార్ట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, నాభా నటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.