పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి చిత్రంలో నటించిన నికీషా పటేల్ గుర్తుందిగా.. ఈ భామ ప్రస్తుతం అరకొర అవకాశాలతో కెరీర్ సాగిస్తోంది. కొమరం పులి తర్వాత నికీషా పటేల్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీనితో తమిళం, కన్నడ భాషల్లో నికీషా పటేల్ కొన్ని చిత్రాల్లో నటించింది. 

ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం ముగిసింది. ఫిలిం ఫేర్ అవార్డుల ఎంపికపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా నికీషా పటేల్ కూడా చేరింది. ఏకంగా RIP ఫిలిం ఫేర్ అవార్డ్స్ అంటూ ట్వీట్ చేసింది. 'రోజు రోజుకు ఫిలిం ఫేర్ అవార్డుల క్రెడిబులిటీ దిగజారిపోతోంది. అందుకు కారణం అర్హత లేని వారికి అవార్డులని కట్టబెట్టడమే అని నికీషా అంటోంది. 

ఉత్తమ చిత్రాలు, డెబ్యూ నటుల ఎంపిక సరిగా జరగలేదని నికీషా పటేల్ ఆరోపిస్తోంది. బాలీవుడ్ లో కూడా ఫిలిం ఫేర్ అవార్డులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమర్శలకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం గల్లీ బాయ్. రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం వివిధ విభాగాల్లో ఏకంగా 13 ఫిలిం ఫేర్ అవార్డులని అందుకుంది. 

దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గల్లీ బాయ్ మంచి చిత్రమే. కానీ 13 అవార్డుల గెలుచుకునేంత సీన్ ఉందా.. ఇందులో అసలు ఉద్దేశం ఏంటి అంటూ నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రానికి గాను ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డు గెలుచుకుంది. ఈ విషయంలో కూడా అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. 

ఇక హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30, అక్షయ్ కుమార్ కేసరి చిత్రాలకు ఒక్క ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కలేదు. దీనితో ఫిలిం ఫేర్ నిర్వాహకులు విమర్శలని ఎదురుకొంటున్నారు. సోషల్ మీడియాలో #BoycottFilmfare అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.