పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వకీల్‌ సాబ్‌. రాజకీయాల్లో బిజీగా కావటంతో చాలా కాలంగా పవన్ సినిమాలకు దూరంగా కావటంతో వకీల్ సాబ్‌ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్ అయిన పింక్ సినిమాకు ఇది అఫీషియల్‌ రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. తెలుగులో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగానే కరోనా ప్రభావంతో అన్ని పనులు వాయిదా పడ్డాయి. అయితే పవన్‌ మాత్రం సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కష్టపడుతున్నాడు. అందుకే తాను కూడా వర్క్‌ ఫ్రమ్ హోం చేయాలని నిర్ణయించాడట. షూటింగ్ పూర్తి అయిన భాగానికి ఇంటి దగ్గర నుంచే డబ్బింగ్ చెప్పేందుకు ఏర్పాటు చేయాలని నిర్మాతలకు సూచించాడట పవన్‌. త్వరలోనే డబ్బింగ్ పనులు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కూడా లైన్‌లో పెడుతున్నాడు పవన్‌. పీరియాడిక్ యాక్షస్‌ డ్రామాగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో పవన్‌ రాబిన్‌ హుడ్‌ తరహా బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. పవన్‌ తొలిసారిగా నటిస్తున్న కాస్ట్యూమ్‌ డ్రామా సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్.