'అజ్ఞాత‌వాసి' సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడు. బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు నుండే సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్ లో సినిమాకి సంబంధించిన మొదటి షాట్ ని సింపుల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మొదలైన పవన్ పింక్.. టార్గెట్ 20

ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెట్టారు. అయితే సినిమా సెట్స్ నుండి పవన్ లుక్ ఒకటి లీక్ అయింది. పవన్ బయట ఉన్నట్లుగానే సేమ్ లుక్ తో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం రఫ్ లుక్ తోనే పవన్ కనిపిస్తున్నాడు. అతడి లుక్ లో ఎలాంటి కొత్తదనం కనిపించడం లేదు. సినిమా కోసం పవన్ గడ్డం తీసేస్తున్నాడని వార్తలు వచ్చినా.. పవన్ మాత్రం గడ్డంతోనే షూటింగ్ లో పాల్గొంటాడని టాక్.

ఈ సినిమా కోసం పవన్ కేవ‌లం ఇరవై రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు.

సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ కోర్టు సెట్ లోనే చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్.. క్రిష్ సినిమా కూడా చేయనున్నాడని సమాచారం.