నటి విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇంత కాలానికి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా తరువాత ఆమె మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కూడా కోరుకుంటున్నాడు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఈ విషయంలో విజయశాంతిని రిక్వెస్ట్ చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వెళ్లకూడదని సినిమాల్లోనే కెరీర్ కొనసాగించాలని కోరారు. విజయశాంతి తన కూతురులాంటిదని చెబుతూ తన జీవితంలో మర్చిపోలేని ఓ అనుభవాన్ని వెల్లడించారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ.. విజయశాంతితో కలిసి నటించారట. విజయశాంతి తనను అంకుల్ అని పిలుస్తుందని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

ఓరోజు 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ కి వెళ్లినప్పుడు సెట్ లో ఏడుగురు ఆర్టిస్ట్ లు ఉన్నారని.. అందరూ ఎవరి క్యారవ్యాన్లలో వారు ఉన్నారని.. తనకు కూడా ఓ క్యారవ్యాన్ ఇచ్చారని పరుచూరి చెప్పారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి విజయశాంతి గారు పిలుస్తున్నారని చెబితే.. ఆమె వద్దకు వెళ్లారట పరుచూరి. ఆ సమయంలో ఆమె చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఉందట.

'అదేంటమ్మా ఇక్కడ కూర్చున్నావ్' అని పరుచూరి ప్రశ్నిస్తే.. 'ఏం చేయమంటారు అంకుల్ షాట్ అయిపోగానే ఎవరికి వారు కారవ్యాన్లలోకి వెళ్లి కూర్చుంటున్నారు' అని అందట. దీంతో కాసేపు ఆమెతో కూర్చొని ముచ్చటించారట పరుచూరి గోపాలకృష్ణ. అలానే విజయశాంతి తనను అంకుల్ అని ఎందుకు పిలుస్తుందనే విషయాన్ని విజయశాంతి స్వయంగా సెట్ లో వారికి వివరించిందని పరుచూరి వెల్లడించారు.

'అపూర్వ సోదరులు' సినిమా సమయంలో విజయశాంతి వాళ్ల అమ్మ చనిపోయారు. కానీ విషయం విజయశాంతికి తెలీదు. తనకు తెలియకుండా దాచామని పరుచూరి చెప్పారు. ఆమెని తీసుకొని చెన్నై బయలుదేరామని చెప్పారు. మరికొద్దిసేపట్లో విజయశాంతి ఇంటికి చేరుకుంటామనగా.. 'ఏమైంది అంకుల్.. మా అమ్మకి' అని అడుగుతూ కంగారు పడిందట విజయశాంతి. ఏం లేదని చెప్పి ఇంటికి తీసుకువెళ్లారట.

అక్కడ బోలెడన్ని కార్లు ఉండడంతో భయపడిపోయిందట విజయశాంతి. లోపలకి పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి భౌతికకాయంపై పడి ఏడ్చేసిందట. 'ఎందుకు చెప్పలేదు అంకుల్' అని పరుచూరి గోపాలకృష్ణని అడిగిందట. ముందే చెబితే మరింత నరకయాతన అనుభవించేదానివి అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఓ షాట్ లో విజయశాంతి నటిస్తున్నప్పుడు షాట్ అయిపోగానే పరుచూరి వైపు చూసిందట. షాట్ సరిగ్గా రాలేదని.. తనకు అర్ధమైందని మరో టేక్ తీసుకొని అధ్బుతంగా నటించిందని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. అసలు విజయశాంతి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లిందో తెలియదని, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదని, కానీ తను మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నట్లు పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.