ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయాన్ని వివరించారు. 

అప్పటికే ఆది చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అల్లరిరాముడు చిత్రాన్ని పాలకొల్లులో షూట్ చేస్తున్నారు. సెట్స్ లో మేము కూడా ఉన్నారు. షాట్ గ్యాప్ లో మేము చినరామయ్య(ఎన్టీఆర్) తో మాట్లాడుతూ.. మీరు ఫ్యామిలీలో అందరితో మాట్లాడతావా అని అడిగాం. 

దీనితో వెంటనే ఎన్టీఆర్ కళ్ళలో నీళ్లు కనిపించాయి. ఏడుస్తూనే.. లేదండీ.. అందరి అభిమానుల్లాగే నాకు కూడా బాబాయ్(బాలకృష్ణ) అంటే ప్రాణం. అభిమానులు బాబాయ్ ని చూసి ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తారో అదే ప్రేమ నాలో కూడా ఉంది అని ఏడ్చాడు. మేము ఫోన్ కలిపి ఇస్తాము మీ బాబాయ్ తో మాట్లాడు అని చెప్పాం. ఎన్టీఆర్ ఏడుపు ఇంకా ఎక్కువైంది. 

బాలయ్యకు ఫోన్ చేసి ఎన్టీఆర్ తో మాట్లాడండి అని అడిగాం.. ఆ ఇవ్వండి అని బాలయ్య అన్నారు.. ఎన్టీఆర్ మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు.. బాలయ్య వాడేందుకు అలా ఏడుస్తున్నాడు.. మీరైనా చెప్పండి అని బాలయ్య అన్నారు. 

నాకు తెలిసి బాలయ్య, ఎన్టీఆర్ మాట్లాడుకోవడం అదే తొలిసారి. వీరిద్దరూ ఒకే వేదికపైన కనిపించాలని మేము అప్పుడే నిర్ణయించుకున్నాం. అల్లరి రాముడు చిత్రం విడుదలయ్యాక ఓ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఆ వేడుకలో చినరామయ్యని బాలయ్య వద్దకు తీసుకెళ్లింది మేమే. బాలయ్యకు దండ వేయమని చెప్పింది కూడా మేమే. అక్కడ కూడా ఎన్టీఆర్ బాలయ్య చూసి ఎమోషన్ తో ఏడుస్తూనే ఉన్నాడు. 

ఈ సంగతులు అభిమానులకు తెలియాలనే ఉద్దేశంతోనే చేతబుతున్నట్లు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.