మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. చిరు మేనల్లుడు, సుప్రీ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. 

భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. కీర్తి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా.. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

తాజాగా ఉప్పెన చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో వైష్ణవ్ తేజ్ స్టిల్ బావుంది. గడ్డంతో కనిపిస్తున్న వైష్ణవ్ సముద్రపు కెరటాల మధ్యలో నిల్చుని గట్టిగా అరుస్తున్నట్లు ఉన్న ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గమనిస్తుంటే నటనకు బాగా ఆస్కారం ఉన్న చిత్రంలా అనిపిస్తోంది. తొలి చిత్రంలోనే నటనకు స్కోప్ ఉన్న రోల్ దొరకడం ఒకరకంగా అదృష్టమే. 

అదే సమయంలో ఛాలెంజ్ కూడా. ఈ బిగ్ టాస్క్ ని వైష్ణవ్ తేజ్ అధికమించేలానే ఉన్నాడు. ఈ చిత్రం కోసం వైష్ణవ్ తన సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేసింది. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

తన తమ్ముడికి అందరూ ఆశీర్వాదాలు అందించండి అని సాయిధరమ్ తేజ్ ఉప్పెన ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు.