ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఉంది. దాంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ హల్ చల్ చేస్తున్నారు. కంగనా...14 ఏళ్ల సినీ ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్రలెన్నో చేసింది. నటిగా పలుమార్లు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న ఆమె... ఇప్పుడు పద్మశ్రీ గౌరవం కూడా ఆమెకి లభించింది.

సినీ పరిశ్రమలో గాడ్‌ ఫాదర్‌ లేకుండా  తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న కంగనా...వచ్చిన ప్రతీ ఆఫర్ ని మెట్లుగా చేసుకుని సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. ‘గ్యాంగ్‌స్టర్‌’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన కంగనా.. 2007లో వచ్చిన  ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’ చిత్రంతో సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తదుపరి సంవత్సరమే మధుర్‌ బండార్కర్‌ తీసిన ‘ఫ్యాషన్‌’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా.  ‘క్వీన్, తను వెడ్స్‌ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఫోర్బ్స్‌ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె.

ఆ తర్వాత ప్రభాస్‌ ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాతో తెలుగుకీ పరిచయమైంది. కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్‌’ సినిమాకు మాటల రచయితగా తన ప్రతిభను చూపించింది. సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన టాలెంట్ ను చూపించింది. ప్రస్తుతం కంగనా రెండూ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది. అయితే ఇంత ప్రతిభ ఉన్న ఆమె తన వివాదాస్పద కామెట్స్ తో  ఎక్కువ శాతం కాంట్రవర్శీల్లో ఉంటూ వస్తోంది.