ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్‌ ఫోర్‌స్టర్‌(78) శుక్రవారం నాడు బ్రెయిన్ కాన్సర్ తో మృతి చెందారు. రాబర్ట్ దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు.

న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్‌, బ్రాడ్‌వేలో ‘డాలీ హ్యాస్‌ ఏ లవర్‌’తో తన కెరీర్ మొదలుపెట్టాడు. ప్రముఖ దర్శకుడు జాన్ హాస్టన్ 1976లో తీసిన 'రిఫ్లెక్షన్ ఇన్ ఎ గోల్డెన్ ఐ' సినిమాతో హీరోగా హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో రాబర్ట్ సరసన ఎలిజిబెత్ టేలర్ హీరోయిన్ గా నటించగా..  ప్రముఖ స్టార్‌ మార్టన్‌ బ్రాండో విలన్ గా చేశారు. క్వెంటిన్‌ టరాన్టినో దర్శకత్వంలో వచ్చిన ‘జాకీ బ్రౌన్‌’ సినిమాలో రాబర్ట్ పోషించిన మాక్స్ చెర్రి పాత్రకి జనాలు ఫిదా అయ్యారు. ఈ పాత్రలో నటించిన ఆస్కార్ అవార్డుకి ఎన్నికయ్యారు.

వెన్‌ స్పీల్‌బర్గ్‌ ‘అమేజింగ్‌ స్టోరిస్‌’, ‘వేర్‌వోల్ఫ్‌’ చిత్రాలలో నటించడంతో పాటు పలు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. తాజాగా ఈయన నటించిన ‘ఈద్‌ ఇన్‌ ఈల్‌ కమీనో’ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.