సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది విడుదలైన చిత్రలహరి చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం తర్వాత తేజు సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ప్రతిరోజూ పండగే చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. రాశి ఖన్నా, తేజులది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ ఆల్రెడీ సుప్రీం చిత్రంలో నటించారు. 

ఇక ప్రతిరోజు పండగే చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని 'ఓ బావా' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. 

చూస్తుంటే ఈ పాట యూట్యూబ్ ని ఊపేసేలా కనిపిస్తోంది. జానపదం తరహాలో హుషారెత్తించే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రోమోలో చూపిన దానిప్రకారం పచ్చటి పొలాల మధ్యలో చిత్రీకరణ, రాశి ఖన్నా గ్లామర్ హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. 

ఓ బావా.. మా అక్కని సక్కగా చూస్తావా.. ఓ బావా ఈ సుక్కని పెళ్లాడేస్తావా అంటూ సాగే లిరిక్స్ కు లయబద్దంగా రాశి ఖన్నా వేస్తున్న స్టెప్పులు అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. శనివారం రోజు తమన్ పుట్టినరోజు కానుకగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇటీవల తమన్ జోరు మామూలుగా లేదు. ఓ వైపు అల వైకుంఠపురంలో సాంగ్స్ అలరిస్తుంటే.. ఇప్పుడు ప్రతిరోజు పండగే చిత్ర పాటల సందడి మొదలయింది. 

దర్శకుడి మారుతి ఈ చిత్రంలో రాశి ఖన్నాని చాలా అందంగా చూపిస్తున్నారు. రాశి ఖన్నా, తేజు మధ్య రొమాన్స్ కు మంచి స్కోప్ ఉన్న చిత్రంలా అనిపిస్తోంది. ఎమోషన్, రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కేవలం ప్రోమో మాత్రమే.. పూర్తి లిరికల్ వీడియోని నవంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.