కరోనా మహమ్మారి పేద, ధనిక, సామాన్యుడా సెలబ్రిటా అనే తేడా లేకుండా.... తన ముందు అందరూ ఒక్కటే అన్నట్టుగా విరుచుకుపడుతుంది. సినిమా ఇండస్ట్రీపై కరోనా వైరస్ కన్నెర్ర చేసినట్టుంది. బండ్ల గణేష్ కి కరోనా వైరస్ సోకిందన్న విషయం ఇంకా వైరల్ గా ఉండగానే మరో నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఓంకార్ కి కరోనా వైరస్ సోకిందన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. 

ఓంకార్ ప్రస్తుతానికి బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ ని సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ చేస్తున్నాడు. ఒంట్లో నలతగా ఉందని, కరోనా లక్షణాలేమో అనే అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాడు ఓంకార్‌. అయితే ఆయనకు నెగెటివ్‌ రిజల్ట్ వచ్చినా మీడియాలో మాత్రం పాజిటిివ్‌ అంటూ ప్రచారం జరిగింది. దీంతో షూటింగ్ స్పాట్ లో పనిచేస్తున్న సిబ్బంది ఇతరులు కూడా ఆందోళన వ్యక్తమయ్యింది. ఈ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్ని అవాస్తవమని తెలిపారు.

తాజాగా  `ఇంటింటి గృహలక్ష్మీ` అనే సీరియల్‌లో నటిస్తున్న హరికృష్ణ అనే నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. హరికృష్ణకు కరోనా సోకటంతో శుక్రవారం జరగాల్సిన సీరియల్ షూటింగ్ వాయిదా పడింది. హరికృష్ణ ఇటీవల కరోనా ప్రభాకర్‌తో సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాకర్‌తో కలిసి నటించిన వారికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్‌ రాక ముందే ఇతర షూటింగ్ లు నిర్వహించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో కోరాలు చాస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతీ రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అన్ని రంగాల్లో సడలింపులు ఇవ్వటంతో కేసు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నటీనటులకు, సాంకేతిక వర్గానికి ఇతర యూనిట్‌ సభ్యులకు ఇన్సూరెన్స్‌ చేయించాలని సినీ, టీవీ కార్మికులు కోరుతున్నారు.

దీనికి ముందు సూర్యకాంతం అనే సీరియల్ షూటింగులో పాల్గొన్న ప్రభాకర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తుంది.