నందమూరి తారక రామారావు వాయిస్ తెలియనది ఎవరికి. ఆయన గొంతుని నిద్రలో కూడా గుర్తు పట్టేయగలరు. అంతలా జనాల్లోకి వెళ్లిపోయిన ఆయనకు డబ్బింగ్ వేరే వారికి చెప్పించే ధైర్యం ఎవరైనా చేస్తారా...అంటే చేసారనే చెప్పాలి. ఆ ధైర్యం సినిమాని ముంచేసింది. తెరపై కనపడే తమ హీరోకు వేరే వారి వాయిస్ ని విని తట్టుకోలేకపోయారు అభిమానులు. అలాగని అదేదో వేరే భాషలో ఎన్టీఆర్ చేసి , తెలుగులోకి డబ్బింగ్ చేసి వదిలిందీ కాదు. తెలుగు స్ట్రైయిట్ సినిమానే. ఆ వింత,పొరపాటు ‘ఎర్రకోట వీరుడు’ అనే సినిమాకు జరిగింది.

1955లో  ప్రముఖ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి తన మేనల్లుడు అయిన హెచ్‌వి బాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పాతాళభైరవి లాంటి జానపదం ఎన్టీఆర్‌తో తీయాలనుకుని తెలుగు, తమిళ భాషల్లో ‘గజదొంగ’ ఆనే టైటిల్ తో ఓ సినిమా మొదలెట్టారు. ఈ సినిమాలో సావిత్రి, బి సరోజదేవి హీరోయిన్లు. రాజనాల, ఆర్ నాగేశ్వరరావు తప్ప మిగతా తారలంతా తమిళులే. ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉండగా హెచ్ ఎం రెడ్డిగారు మరణించారు. దాంతో హెచ్ వి బాబు అప్పటికే తమ బ్యానర్ లో పూర్తైన  ‘వద్దంటే డబ్బు’ విడుదల చేయగలిగారు కానీ, ‘గజదొంగ’ని మాత్రం చేయలేకపోయారు. ఆ సినిమా ఆ తర్వాత అలాగే డబ్బాల్లో ఉండిపోయారు. ఆ తర్వాత మరికొందరు ఎన్టీఆర్ సినిమా కదా అని ఉత్సాహపడ్డారు కానీ వాళ్ల వల్ల కాలేదు. ఆ తర్వాత విలన్ పాత్ర చేసిన  ఆర్ నాగేశ్వరరావు  చనిపోవడంతో ఆ పాత్రను తమిళ నటుడు నంబియార్‌తో చేయించారు. డైరక్టర్  కూడా మారారు. పార్థసారథి ఆ సినిమాని పూర్తిచేశారు. కానీ తర్వాత బిజినెస్ సమస్యలతో  మళ్లీ ఆగిపోయింది.

ఆఖరికి  ఈ చిత్రం నిర్మాత టి గోపాలకృష్ణ దగ్గరకు చేరింది. ఇదంతా జరిగేసరికి  ఈ సినిమా మొదలుపెట్టి పద్దెనిమిదేళ్లు గడిచిపోయింది. అయినా ఎన్టీఆర్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని సంకల్పించారు. అందుకోసం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దశరథరామిరెడ్డి ఆయనకు సహకారంగా నిలిచారు. దాంతో టైటిల్ ని మార్చారు.  తెలుగులో ‘ఎర్రకోట వీరుడు’ తమిళంలో- తిరుడాదే తిరుడన్ అని టైటిల్స్ పెట్టారు.

అయితే ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. ఎప్పుడో పద్దనిమిదేళ్ల క్రితంనాటి సినిమాకి డబ్బింగ్ చెప్పమని ఎన్టీఆర్‌ను అడగడం పద్దతి కాదనుకుని దశరథరామిరెడ్డితో ఆ పాత్ర డబ్బింగ్ చెప్పించేశారు. అదే పెద్ద పొరపాటు అయ్యింది.  అలాగే సావిత్రి, బి సరోజదేవి, రాజనాల పాత్రలు కూడా వేరేవారితో డబ్బింగ్ చెప్పించారు. అప్పుడు ఎన్టీఆర్ చేసిన దేవుడుచేసిన మనుషులు, వాడే వీడు వంటి సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. అప్పుడు   ఈ ‘ఎర్రకోటవీరుడు’ రిలీజ్ కు సిద్దమైంది.

1973 డిసెంబర్ 14న ‘ఎర్రకోట వీరుడు’ సినిమా విడుదల చేసారు. ఎన్టీఆర్ సినిమా కావడంతో ఓపినింగ్స్ బాగున్నాయి. కానీ సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల తరువాత తెరపై ఎన్టీఆర్ కనబడిన తర్వాత.. ఆయన డైలాగ్ చెప్పడం మొదలెట్టగానే -ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అది ఆయన గొంతు కాదని కాస్సేపటికి అర్దమైంది. వేరేవారి గొంతుతో ఎన్టీఆర్ ని తెరపై అసలు చూడలేకపోయారు.  అట్టర్ ఫ్లాప్.  

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు ప్రతాప్. మహారాజు  కొడుకేగాని,సైన్యాధిపతి కుట్ర కారణంగా గజదొంగగా పెరిగిపెద్దై...ఆ... తర్వాత ప్రజాపక్షం వహించి దుర్మార్గులను తుదముట్టిస్తాడు.