సినిమా అభిమానులకు ఇది బిగ్ న్యూసే.. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ తో ఇంటిలోనే ఉండిపోయిన సినీ ప్రియులకు కాస్త ఆటవిడుపు కలిగించే వార్త. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ఇప్పటికే ఓసారి వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. 

వారి నిరాశని తొలగించడానికి రాజమౌళి నడుం బిగించాడు. బుధవారం మార్చి 25న ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ చిత్ర టైటిల్ లోగో విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. అంతే కాదు నీటి బిందువులు వెదజల్లుతూ ఉన్న ఎన్టీఆర్ చేయి.. నిప్పు రవ్వలు ఎగసి పడుతున్న రాంచరణ్ చేయితో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.  

ఈ సందర్భంగా రాజమౌళి అభిమానులకు పెద్ద అప్పీల్ చేశాడు. కరోనా వైరస్ ప్రభావంతో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండి ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో  ఎంజాయ్ చేయాలని కోరారు. అలాగే టైటిల్ లోగో విడుదల చేసే టైంని మాత్రం చెప్పలేం అని .. కరోనా కారణంగా తన టీం మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోందని రాజమౌళి తెలిపాడు. 

అంటే రేపు ఏ సమయంలో అయినా ఆర్ఆర్ఆర్ టైటిల్ రిలీజ్ కావొచ్చు. టైటిల్ లోగోని మోషన్ పోస్టర్ రూపంలో విడుదల చేయనున్నారు. దయచేసి ఇంట్లోనే ఉండండి.. ఫ్లెక్సీలు, టైటిల్ లోగో ప్రింట్స్ చేయొద్దు.. ఇది నా రిక్వస్ట్ అంటూ రాజమౌళి అభిమానులని కోరాడు. 

400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి, కొమరం భీం యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లిన పాయింట్ ని తీసుకుని రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పిత గాధగా తెరకెక్కిస్తున్నారు. 

డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.