దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి అఖండ విజయం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1920 నాటి బ్రిటిష్ కాలం పరిస్థితుల నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

టాలీవుడ్ అగ్ర హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో రాంచరణ్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

వారం రోజులపాటు రాజమౌళి ఇక్కడ కీలక సన్నివేశాలని చిత్రకరించనున్నారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట. ఏజెన్సీ ప్రాంతంలోని మోదపల్లి, డాల్లపల్లి మండలాల్లో కాఫీ తోటల్లో రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. 

తాను వివరించిన విషయాలు తప్ప ఆర్ఆర్ఆర్ కథకు సంబంధించిన ఎలాంటి లీకులు లేకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు. సమకాలీకులు అయిన అల్లూరి, కొమరం భీం స్నేహితులు అయితే ఎలా ఉండేది అనే ఆసక్తికర పాయింట్ తో కల్పిత గాధగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ మూవీలో రాంచరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు హీరోయిన్ గా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఐర్లాండ్ కు చెందిన హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడి విలన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.