మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులని సర్ ప్రైజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రారంభం అయ్యాక రాజమౌళి కొన్ని విషయాలు మినహా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. విడుదల తేదీ కూడా వాయిదా పడింది. దీనితో తమ అభిమాన హీరోలని చూసేందుకు చరణ్, ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ జరిగిన దాదాపు ఏడాది తర్వాత చరణ్, ఎన్టీఆర్ కలసి మీడియా ముందుకు వచ్చారు. కానీ ఈసారి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి చెప్పడానికి కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహనా పెంచేందుకు. ఈ వీడియో ద్వారా కరోనా బారీన పడకుండా ఉండేందుకు చరణ్, ఎన్టీఆర్ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు పాటిస్తే కోవిడ్ 19 వైరస్ బారీన పడకుండా ఉండొచ్చు అని చరణ్ ఎన్టీఆర్ తెలిపారు. చేతులు మోచేతివరకు సబ్బుతో కడగడం,  కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వారిని కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. వేడి నీళ్లు తాగడం మంచిది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే  ప్రతి విషయాన్ని నమ్మొద్దు.. ఇది కరోనా కంటే ప్రమాదం.. పానిక్ సిచ్యువేషన్ కు కారణం అవుతుంది అంటూ చరణ్, ఎన్టీఆర్ ఈ వీడియోలో కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తెలిపారు. 

ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి లుక్స్ అదిరిపోయే విధంగా ఉన్నాయి. బహుశా ఈ వీడియో ఆలోచన రాజమౌళిదేనేమో. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో తెరక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.