ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల సందడి ఎక్కువగా ఉంటుంది.  ఈ సంక్రాంతికి కూడా బడా చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా రిలీజ్ కు రెడీ అయిపోయాయి. 

సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న విడుదలవుతుండగా, అల వైకుంఠపురములో మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా దర్బార్ చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇలాంటి భారీ చిత్రాల ఎఫెక్ట్ తో చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం  కనిపించడం లేదు. 

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా చాలా రోజుల క్రితమే సంక్రాంతి బెర్త్ ఖరారు చేసుకుంది. జనవరి 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని వినికిడి. మహేష్, బన్నీ, రజనీకాంత్ లాంటి బడా హీరోల నడుము విడుదలవుతున్న ఈ చిన్న చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. 

ఆ మధ్యన విడుదలైన ఎంత మంచివాడవురా చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీకి ఆశించినంత బడ్జెట్ క్రియేట్ కాలేదు. అంతటా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల మ్యానియా నెలకొంది ఉంది. మొత్తంగా ఈ చిత్ర బిజినెస్ నిర్మాతలని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా జనవరి 15నే రిలీజ్ చేస్తారా లేక మరో మంచి టైం చూసుకుంటారా అనేది వేచి చూడాలి.