బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి, మూవీ మాఫియా కారణంగానే.. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అందరూ ఆరోపించారు. బాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులను నెటిజన్లు విమర్శించారు కూడా. అయితే.. అనుకోకుండా ఈ కేసు ఇప్పుడు మలుపు తిరిగింది. నెపొటిజం కారణం కాదని.. గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణంగానే సుశాంత్ కి ఇలాంటి పరిస్థితి ఎదురైందంటూ వాదనలు వినపడుతున్నాయి.

అంతేకాకుండా.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అతని ఇంట్లో పార్టీ జరిగిందని.. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా.. పోలీసులు సుశాంత్ ఇంటి పనివారిని కూడా విచారించారు.

అయితే.. వాళ్లు చెప్పిన దాని ప్రకారం.. ముందు రోజు రాత్రి సుశాంత్ ఇంట్లో ఎలాంటి పార్టీ జరగలేదని వారు చెప్పారు. సుశాంత్ రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడని చెప్పారు. కనీసం బయట పార్టీకి కూడా సుశాంత్ ఎక్కడికీ వెళ్లలేదని.. ఇంట్లోనూ ఎలాంటి పార్టీ జరగలేదని చెప్పారు. ఉదయాన్నే యాథావిధిగా నిద్రలేచాడని చెప్పారు.

అయితే.. చనిపోయే రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సుశాంత్ ఇద్దరికి ఫోన్ చేయడం గమనార్హం. ఒకరు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా కాగా.. మరొకరు ఆయన ఫ్రెండ్ మనీష్ శెట్టి. కానీ ఈ ఇద్దరూ సుశాంత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. కాగా.. ప్రస్తుతం సుశాంత్ కేసు.. గర్ల్ ఫ్రెండ్ రియాకి వ్యతిరేకంగా వెళుతోంది. ఆమెతో పాటు.. ఆమె కుటుంబసభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. కాగా.. పోలీసులకు చిక్కకుండా రియా ప్రస్తుతం అదృశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.