‘కుమారి శ్రీమతి’గా నిత్యామీనన్,ఒక్క డైలాగుతో మొత్తం చెప్పేసారు
అబ్దుల్ కలాం అంట.. రజినీకాంత్ అంట.. ఆ తర్వాత ఈవిడేనంట.. ఉద్యోగం.. సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తుందంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కొస్తుందట.

నిత్యా మీనన్.. కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పేరు చెప్తే తెలుగులో టిక్కెట్లు తెగుతాయి. అయితే ఆమె వరస పెట్టి సినిమాలు చేస్తూ క్రేజ్ క్యాష్ చేసుకోవాలి అనుకోదు. తనకు తగ్గ పాత్ర, అదీ తనకు నచ్చింది అయితేనే ఓకే చెప్తుంది. అలా మొదలైంది సినిమా నుంచి మొదలెట్టి చాలా సినిమాల్లో తన అద్బుత నటనతో అదరగొట్టింది. నిత్యామీనన్ చివరగా తెలుగులో భీమ్లానాయక్ సినిమాలో కనిపించారు. ధనుశ్ 50వ సినిమాలో నటించనున్నారు నిత్య. ధనుశ్ - నిత్య కాంబినేషన్‍లో గతేడాది వచ్చిన తురిచిత్రాంబలం (తెలుగులో తిరు) మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె ఓటిటిలోకి డైరక్ట్ ఎంట్రీ ఇస్తోంది.
కుమారి శ్రీమతి పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మోషన్ టేల్స్, స్వప్న సినిమాస్ ఈ వెబ్ సిరీస్‍ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గోమతేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. కాగా, ‘కుమారి శ్రీమతి’ మోషన్ పోస్టర్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మీరూ ఓ లుక్కేయండి.
“అబ్దుల్ కలాం అంట.. రజినీకాంత్ అంట.. ఆ తర్వాత ఈవిడేనంట.. ఉద్యోగం.. సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తుందంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కొస్తుందట. పెళ్లి.. గిళ్లి వద్దంట వదినోయ్. ఇట్టాగే ఉండిపోద్దట” అనే వాయిస్ ఓవర్‌తో కుమారి శ్రీమతి సిరీస్ మోషన్ పోస్టర్ వీడియో మొదలైంది. 'ఎవరి గురించి వదినా నువ్వు మాట్లాడేది?' అని మరో మహిళ అడిగితే... 'ఉందిగా ఆ దేవికమ్మ పెద్ద కూతురు' అని సమాధానం చెబుతుంది. అప్పుడు అర్థం అవుతుంది. దాంతో 'ఓహో! శ్రీమతా...' అని తెలిసినట్టు చెబుతుంది. అవును... 'కుమారి శ్రీమతి' అని ఆన్సర్! అప్పుడు నిత్యా మీనన్ ఫేస్ చూపించారు. ఈ వీడియోతో ఈ సిరీస్‍లో నిత్యామీనన్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో మేకర్స్ వెల్లడించారు.
పెళ్లి చేసుకోకుండా.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాలనే స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రను ‘కుమారి శ్రీమతి’ సిరీస్‍లో పోషించింది నిత్యా మీనన్ అని అర్దమవుతోంది. కుమారి శ్రీమతి సిరీస్‍కు శ్రీనివాస్ అవసరాల, ఉదయ్, కార్తీక్, జయంత్ రచయితలుగా ఉండగా.. గోమతేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అతి త్వరలో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. అయితే, స్ట్రీమింగ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‍ను వైజయంతీ మూవీస్, స్వప్న మూవీస్ నిర్మిస్తుండటంతో ఖచ్చితంగా బజ్ క్రియేట్ అవుతుందనటంలో సందేహం లేదు.