ప్రస్తుతం ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్-రష్మిక జంటగా నటించిన తాజా సినిమా ‘బీష్మ’. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటు నితిన్ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక దానికి  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ ‌28వ చిత్రంగా చెప్పబడుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇంతకు ముందు ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కు రెస్పాన్స్ పూర్ గా ఉండటంతో వద్దనుకుని మరో టైటిల్ వైపు మ్రొగ్గు చూపినట్లు సమాచారం. ఆ టైటిలే  ‘చెక్’.

ఓ ఇంట్రస్టింగ్ థ్రిల్లర్ ఇదని, ఓ కొత్త తరహా నేరేషన్ తో సినిమా సాగుతుందని చెప్తున్నారు.  మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌  జరుగుతోంది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని నితిన్‌ భావించి చేస్తున్నారు. డార్జిలింగ్ నేపధ్యంలో జరిగే కథ ఇది అని తెలుస్తోంది.

‘చంద్రశేఖర్‌ యేలేటితో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. మొత్తానికి రకుల్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌లతో కలిసి పనిచేయబోతున్నాను. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు’ అని పేర్కొన్నారు నితిన్‌.

ఈ సినిమా ఒక చదరంగం ఆటలా ఎత్తులు..పై ఎత్తులతో నిండి ఉంటుందిట. అందుకే ఈ సినిమా ‘చెక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని చెప్తున్నారు. ఈ కథలో అనేక మలుపులు ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ వేసవి కానుకగా ఈ సినిమా రాబోతుంది.