ఆ మధ్యన కాస్త వెనకబడ్డా మళ్లీ పుంజుకుని వరస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నితిన్.  భీష్మ, రంగ్ దే, చదరంగం వంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ నితిన్ క్షణం ఖాళీలేనంత  బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను నితిన్ అలరించటానికి సిద్దపడుతున్నారు.  ఈ నేపధ్యంలో అందరి దృష్టీ నితిన్ పైనే ఉంది.

దాంతో తాజాగా ఆయన తీసుకున్న డెసిషన్ ..ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  నితిన్ తండ్రి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఆ మధ్యన..బాలీవుడ్ థ్రిల్లర్ అంధాధున్ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అందులో నితిన్ హీరోగా చేయబోతున్నాడని అందరూ ఊహించారు. డైరక్టర్ గా సుధీర్ వర్మ చేయబోతున్నారని చెప్పుకున్నారు. మీడియా అంతా అదే టాపిక్ తో హోరెత్తిపోయింది.

అయితే రీసెంట్ గా తన నెక్ట్స్ ప్రాజెక్టు సైన్ చేసే ముందు తన సన్నిహితులతో చర్చించిన నితిన్ ...ఆ సినిమా రీమేక్ వద్దనుకున్నారట. తను కమర్షియల్ హీరోగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్లీ కథే ప్రధానంగా సాగే ఆ సినిమా చేయటంతో  ఇమేజ్ కు ఇబ్బంది వస్తుందని, చేయవద్దని ఓ పెద్ద దర్శకుడు సలహా ఇచ్చారట. అందులోనూ ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ వంటివాటికి ప్రయారిటీ ఉండదు.  

అదీ తను ఇన్నాళ్లు వేసుకుంటూ వచ్చిన కమర్షియల్ పునాదులపై నిలబడదని, తన ఫ్యాన్స్ తనను ఓ గుడ్డివాడి పాత్రలో డైజస్ట్ చేసుకోలేరని అనుకున్నారట. ఏ ఇమేజ్ లేని హీరో చేస్తే వర్కవుట్ అవుతుందని, లేదా కామెడీ టోన్ ఉన్న హీరో  చేసినా బాగుంటుందని భావిస్తున్నారట. ఈ నేపధ్యంలో నితిన్ తన సొంత బ్యానర్ లో ఒక యంగ్ హీరో తో ఆ మూవీ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక యువ దర్శకుడి ని ఆ మూవీ ద్వారా టాలీవుడ్ కు నితిన్ పరిచయం చేయనున్నారని సమాచారం.

అయితే ఆ యంగ్ హీరో రాజ్ తరణ్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. అయితే నానితో సినిమా చేస్తే బాగుంటుందని కొందరు నితిన్ కు సలహా ఇస్తున్నారట. బడ్జెట్ కంట్రోలులో  ఉండే విధంగా ప్లాన్ చేయాలని సుధాకర్ రెడ్డి అనుకుంటున్నట్లు సమాచారం.  32 కోట్లతో నిర్మించిన అంధాధున్ మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 456 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.  మాతృక నిర్మాతైన వయాకామ్ 18 తెలుగులోనూ నిర్మాణభాగస్వామిగా వ్యవహరించనుందట. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఆయుష్మాన్ ఖురానా కళ్లు లేని వ్యక్తిగా మెప్పించాడు.