ప్రస్తుతం మన హీరోలు హిందీ మార్కెట్ మీద కూడా గట్టిగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. సినిమాలను డైరెక్ట్‌గా హిందీలో రిలీజ్ చేయకపోయినా తెలుగు రిలీజ్‌ అయిన కొద్ది రోజులకు డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన మాస్ కమర్షియల్ సినిమాలకు ఉత్తరాదిలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికీ పలువురు స్టార్ హీరో ఈ రంగంలో రికార్డ్‌లు సృష్టిస్తుండగా తాజాగా నితిన్‌ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు.

సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ తమ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసిన డబ్బింగ్‌ సినిమాలు భారీగా వ్యూస్ సాధిస్తున్నాయి. తాజాగా హీరో నితిన్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వెర్ష‌న్ కు ఓవ‌ర్ ఆల్ గా 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం.

వీటిలో అత్యధికంగా అఆ కు 182 మిలియ‌న్ల వ్యూస్ రాగా అ ఆ 2  పేరుతో రిలీజ్ చేసిన ఛ‌ల్ మోహ‌న్ రంగ హిందీ వెర్ష‌న్ కు 112 మిలియ‌న్ల వ్యూస్, తెలుగులో ఫ్లాప్‌ అయిన శ్రీనివాస క‌ళ్యాణం కు కూడా 100 మిలియ‌న్ల వ్యూస్ రావటం విశేషం. నితిన్ న‌టించిన ఈ మూడు సినిమాలుకి సంబంధించిన హిందీ డ‌బ్బింగ్ రైట్ ఆదిత్య మూవీస్ తోనే ఉన్నాయి. అలానే ఈ మూడు సినిమాలు నితిన్ కెరీర్ లో వ‌రుస‌గా రిలీజ్ అవ్వ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా సంస్ధ మేనెజింగ్ డైరెక్ట‌ర్ ఉమేశ్ గుప్త మాట్లాడుతూ, `మా ఆదిత్య మూవీస్ ఛాన‌ల్ ని విశేషంగా ఆద‌రిస్తున్న వ్యూయ‌ర్స్ అంద‌రికీ నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ లో నితిన్ హీరో గా వచ్చిన అ ఆ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయడంతోనే మా ఆదిత్య మూవీస్ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా యాక్షన్ మూవీస్ ఇష్టపడే నార్త్ ఆడియన్స్, అ ఆ వంటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ ని విశేషంగా ఆదరించారు.

అనూహ్యంగా అ ఆ తరువాత కూడా నితిన్ నుంచి వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలకి భారీగా స్పందన లభించడం విశేషం. నితిన్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న న‌టించిన సినిమాల్లో దాదాపు 19 సినిమాలు ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేయడం జరిగింది,  వాటిలో జ‌యం, దిల్, సై, ఇష్క్, అ ఆ,  భీష్మ  వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి,  ఇన్నేళ్లుగా మా సంస్థ పై న‌మ్మ‌కం ఉంచుతూ వస్తున్న నితిన్ గారికి ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞత‌లు, అభినంద‌న‌లు తెలుపుతున్నాను` అన్నారు.