యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తరచూ తన సినిమాల గురించి మాత్రమే మాట్లాడే నిఖిల్ మొదటిసారి తన ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి మాట్లాడారు. తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఓ కార్యక్రమంలో నిఖిల్ చెప్పుకొచ్చాడు. మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తోన్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే షోలో పాల్గొన్న నిఖిల్ తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు.

తన జీవితంలో స్పెషల్ అమ్మాయి ఉందని.. ఆమె డాక్టర్ అని, చాలా మంచిదని చెప్పారు. తనను బాగా అర్ధం చేసుకుంటుందని, షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ స్నేహితులతో  బయటకి వెళ్లినప్పుడు కానీ అసలు డిస్టర్బ్ చేయదని.. అనుమానంతో ఫోన్ చెక్ చేయడం వంటివి కూడా చేయదని చెప్పాడు.

నీకు నచ్చినట్లుగా ఉండమని చేబుతుంటుందని.. జీవితంలో ప్రతీ ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అంటూ ఉండాలని.. ఆ విషయం ఆమెకి బాగా తెలుసనని తన గర్ల్ ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పాడు నిఖిల్. ఈ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల నిఖిల్ ఆ అమ్మాయి తల్లితండ్రులను కలిశాడట. 

పెళ్లి చేసుకుంటామని చెప్పగానే వారు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. నిఖిల్ ఇంట్లో కూడా తన ప్రేమకు ఎలాంటి అడ్డంకి లేదని తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. సినిమాల విషయానికొస్తే.. నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాలో నటిస్తున్నారు.