టాలీవుడ్ లో బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. ఇక మొత్తానికి కొంత మంది కుర్ర హీరోలు 2020లో పెళ్లికి సిద్ధం కాబోతున్నారు.

ఇప్పటికే నితిన్కి ఒక అమ్మాయిసెట్టయ్యింది. పెళ్లి ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అదే తరహాలో మరో కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా పెళ్లికి సిద్ధం కాబోతున్న విషయం తెలిసిందే. అసలైతే రెండేళ్ల క్రితమే ఈ హీరో పెళ్లి కావాల్సింది. కానీ జాతకాలు కలవలేదని ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ తీసుకున్న నిఖిల్ కెరీర్ పై ద్రుష్టి పెట్టాడు. మొత్తానికి అర్జున్ సురవరం సినిమాతో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.

ఇటీవల డాక్టర్ పల్లవితో ఎంగేజ్మెంట్ చేసుకున్న నిఖిల్ వెంటనే తన కొత్త సినిమా 'కార్తికేయ 2' పనులను మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమా షూటింగ్ కారణంగా పెళ్లికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి అని నిఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. చేతినిండా పని ఉండడంతో పెళ్లి పనులకు సమయం దొరకడం లేదని చెబుతున్నాడు. హనీమూన్ కి కూడా ఇప్పట్లో సెలవులు దొరికే పరిస్థితి కనిపించడం లేదట. మరీ నిఖిల్ తన షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.