క్రిందటవారం యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం రిలీజైంది. చాలా కాలం ఆగి, అనేక వివాదాలు, ఇక రిలీజ్ కాదేమో అనే అనుమానాలు తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో తన చిత్రం ప్రమోషన్ ని తనే భుజాన వేసుకుని... నిఖిల్ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను సందర్శిస్తూ  ఫ్యాన్స్ ని కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు షాక్ ఇచ్చే విషయం జరిగింది.

సినిమా ప్రమోషన్  టూర్ లో భాగంగా  గుంటూరు వెళ్లిన నిఖిల్ కు రోడ్డు ప్రక్కనే బహిరంగంగా పైరసీ సీడీలు అమ్ముతున్న విషయం గమనించి షాక్ కి గురయ్యాడు. అనేక కష్టనష్టాలు పడి , వేలమంది కష్టపడితే ఒక సినిమా రెడీ అవుతుంది. అలాంటి సినిమా పైరసీ సీడీలను ఇలా రోడ్లపై అమ్మేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.టీతాగుదామని రోడ్డు పక్కన దిగగా నిఖిల్ కు ఈ దృశ్యం కంటపడింది. 

అలాగే ఇదే పరిస్థితి కనుక కొనసాగితే కొన్నాళ్ళకు సినిమా చచ్చిపోతుందని అన్నారు. అయితే పైరసీ సీడీలు అమ్ముతున్న మహిళను పోలీస్ లకు పట్టించలేదు. ఆమె దీనగాథను విన్న నిఖిల్, ఇలాంటి వాళ్ళను ఏమి చేయగలం అని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలా మంది ఆమెను అరెస్ట్ చేయించవచ్చు కదా అని అంటూంటే, మరికొందరు నిఖిల్ ని రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు.

అర్జున్ సురవరం మూవీని టి సంతోష్ తెరకెక్కించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. నవంబర్ 29 న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్స్ ని రాబడుతుంది.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ రకరకాల కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. లేట్ గా వచ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోవటం నిఖిల్ కు ఆనందాన్ని కలగ చేస్తోంది. తమిళ్ లో కనితన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు నేటివిటిగా తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. నిఖిల్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.