స్టార్ వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిహారికా కొణిదెల. అభిమానులు ఎంత వ్యతిరేకించినా ఫ్యామిలీ సపోర్ట్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ  ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే హీరోయిన్‌గా మంచి ఫేం వచ్చినా సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో అమ్మడి కెరీర్‌కు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గి పోయాయి.  ఎన్నో ఆశలతో వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ బ్యూటీకి నిరాశే మిగిలింది.

అయితే సపోర్టింగ్ రోల్స్‌లో అయినా సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. మెగా వారసురాలి నిలబెట్టేందుకు ఏకంగా మెగాస్టారే రంగంలోకి దిగాడు. చిరు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించింది మెగా డాటర్‌ నిహారిక. ఈ సినిమాతో అయిన తనకు బ్రేక్‌ వస్తుందని భావించిన ఈ భామ కు మరోసారి నిరాశే మిగిలింది.

అయితే మరోసారి నిహారిక కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొరాటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు తెర మీద కనిపించే పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్‌కు చెల్లిగా రియల్‌ లైఫ్‌ సిస్టర్ నిహారిక కనిపించనుంది. ఇప్పటికే చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉండగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఆచార్య షూటింగ్ కూడా డిలే అవుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవటంతో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.