నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నో ఆశలతో స్వయంగా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ సినిమాలతో బాలయ్య పేరుతో పాటు డబ్బు కూడా భారీగా పోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ఇటీవల రూలర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది.

తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో బాలయ్య ఇమేజ్‌ దారుణంగా దెబ్బతింది. దీంతో మరోసారి షార్ట్ గ్యాప్ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్‌ హిట్‌ కావటంతో హ్యాట్రిక్ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడి ఎవరన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.

టాలీవుడ్‌ లో సీనియర్ హీరోలకు చాలా రోజులుగా హీరోయిన్ల సమస్య ఉంది. యంగ్ జనరేషన్‌ హీరోయిన్లు సూట్ కాకపోవటం, సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టడంతో సీనియర్ హీరోలకు జోడి దొరకటం కష్టమవుతోంది. అయితే తాజాగా బాలయ్య సినిమా విషయంలోనూ అదే సమస్య ఎదురైంది. ముందుగా నయనతారను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపించినా.. తరువాత కాదని తేలిపోయింది.

తాజాగా హీరోయిన్‌ విషయంలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఓ కొత్తమ్మాయి నటించనుందట. ఇప్పటికే ఇద్దరిని ఫైనల్ చేసిన దర్శకుడు వారిలో ఒకరిని పైనల్ చేయాలని భావిస్తున్నాడు.  శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.