సోషల్ మీడియాలో ఒక్కోసారి నెటిజన్లు చేసే తప్పులకు సెలబ్రిటీలు బలవుతుంటారు. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. దసరా సందర్భంగా కమెడియన్ సుడిగాలి సుధీర్ తో పాటు కొంతమంది కమెడియన్లు కలిసి 'సుధీర్ ఇంట్లో దెయ్యం' అనే టీవీ షోని షూట్ చేశారు.

దసరా రోజు టెలికాస్ట్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. అయితే ఈ షోలో ఓ కోతిని కట్టేసి తీసుకొచ్చారు. ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో కోతిని షోకి తీసుకొచ్చారు. అయితే మూగజీవాలని హింసిస్తే రష్మి ఊరుకోదనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే మూగజీవాలపై హింస ఆపాలంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే షో కోసం కోతి పిల్లను తీసుకురావడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా రష్మిని ట్యాగ్ చేస్తూ ఆమెని ప్రశ్నించాడు. షో కోసం కోతి పిల్లను తీసుకొస్తే.. ఈ విషయంలో రష్మి నోరు మెదపడంలేదేంటి..? ఇన్ని రోజులు నువ్ చేసిందేంటి రష్మి..? అంటూ ప్రశ్నించాడు.

దీనిపై స్పందించిన రష్మి.. మూగజీవాల కోసం తను చేస్తోన్న సేవ గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పింది. ఆ తరువాత 'సుధీర్ ఇంట్లో దెయ్యం' షోలో కోతి పిల్లను తీసుకొచ్చిన ఎపిసోడ్ లో తను లేనని, ఎపిసోడ్ ని మరోసారి జాగ్రత్తగా చూడాలని బదులిచ్చింది. దీంతో నెటిజన్ సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం రష్మి తన టీవీ షోలతో బిజీగా గడుపుతోంది.