బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా అద్భుత నటనతో మెప్పించిన రానా భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రానా విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. రానా నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త తాజాగా బయటకు వచ్చింది. 

ఓ కొరియన్ యాక్షన్ చిత్ర తెలుగు రీమేక్ లో రానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం చూసిన రానా ఇంప్రెస్ అయ్యాడట. దీనితో తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ని అనుకున్నారట. ఈ పాత్రలో కీర్తి సురేష్ పోలీస్ అధికారి పాత్రలో నటించాల్సి ఉంటుంది. 

 కానీ కీర్తి సురేష్ ఈ చిత్రానికి నో చెప్పినట్లు టాక్. దీనితో రానా టీం నయనతారని సంప్రదించారు. కొరియన్ చిత్రాన్ని చూసిన నయన్ వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలని రానా భావిస్తున్నాడు. త్వరలో ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించి అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

నయనతార, రానా జంటగా ఇదివరకే కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రంలో నటించారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ పర్వాలేదనిపించింది. రానా కోసం వరుసగా భారీ చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. రానా ప్రస్తుతం ఓ హిందీ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రం హిరణ్యకశ్యప రూపొందనుంది.