సాధారణంగా ఓ హీరోయిన్‌ సినిమా అంగీకరించిందంటే.. ఈ సినిమా షూటింగ్‌, తరువాత నిర్మాణానంతర కార్యక్రమాలు, ప్రమోషన్‌, సక్సెస్‌ మీట్‌లు, ఇతర ఫంక్షన్స్‌ అన్నింటికీ హాజరు కావాల్సి ఉంటుంది. దాదాపు హీరోయిన్లందరూ ఈ నింబంధనలకు అంగీకరించే సినిమాలకు సైన్ చేస్తారు. కానీ కొంత మంది సీనియర్ హీరోయిన్లు మాత్రం ఇవేమి పట్టించుకోరు. షూటింగ్ పూర్తయితే ఇక ఆ సినిమాతో తమకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు తారలు. ముఖ్యంగా నయనతారపై ఈ విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి.

కెరీర్‌ స్టార్టింగ్ లో సినిమా ప్రమోషన్‌లకు వచ్చిన నయన్‌, స్టార్ ఇమేజ్‌ వచ్చిన తరువాత ప్రమోషన్‌లకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది. ఏవో పిచ్చి సెంటిమెంట్లను సాకుగా చూపించి సినిమా ప్రచారలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. చాలా కాలంగా ఇదే పద్ధతి ఫాలో అవుతున్న నయనతార, తాజాగా ఆ రూల్స్‌ను బ్రేక్‌ చేసేందుకు నిర్ణయించుకుందట. తన మాతృభాష మలయాళంలో తెరకెక్కనున్న ఓ సినిమా కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నయన్‌ అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

ఆ సినిమాలో నయన్‌ నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తోంది. నరసింహా సినిమాలో రమ్యకృష్ణ పోషించిన తరహా పవర్‌ ఫుల్ పాత్ర కావటంతో మిస్‌ చేసుకోవద్దన్న ఉద్దేశంతో నయన్‌, చిత్ర దర్శక నిర్మాతల కండిషన్స్‌కు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మరి ఒక్క సినిమా కోసం ఇలా తాను పెట్టుకున్న రూల్స్‌ బ్రేక్‌ చేస్తే తరువాత మిగతా నిర్మాతల నుంచి కూడా ఇవే డిమాండ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ పర్యవసానాలకు అంగీకరించి ఆలోచించే నయన్‌ ఈ నిర్ణయం తీసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.