నేచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని నటించే చిత్రాలు నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెడుతుంటాయి. మిగిలిన స్టార్ హీరోలతో పోల్చుకుంటే నాని ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటిస్తుంటాడు. హీరోగా ఇంత బిజీగా ఉంటూనే నాని నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. 

ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని నిర్మించిన అ! చిత్రం మంచి విజయం సాధించింది. ఈ థ్రిల్లర్ మూవీలో కాజల్, రెజీనా, నిత్యామీనన్ కీలక పాత్రల్లో నటించారు. అ! ఇచ్చిన ఉత్సాహంతో నాని మరో చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు. ఫలక్ నుమా దాస్ చిత్రంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తో నాని తాజాగా ఓ చిత్రాన్ని ప్రకటించాడు. 

ఈ చిత్రానికి 'హిట్' అనే ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించారు. సినిమాపై ఉత్కంఠ పెంచేలా టైటిల్ పోస్టర్ ని కూడా నాని తన సోషల్ మీడియాలో విడుదల చేశాడు. టైటిల్ పోస్టర్ చూడగానే ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. హిట్ టైటిల్ పై ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. 

చిలసౌ ఫేమ్ రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నేడే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా నాని ఈ ప్రకటన చేశాడు.