రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు తెలియజేయగానే ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. సమకాలీకులైన వీరిద్దరూ రెండేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు.

వీరిద్దరూ స్నేహితులైతే ఆ సమయంలో ఏం జరిగి ఉంటుంది అనే అంశాన్ని రాజమౌళి కల్పితగాధగా చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధులుగా ఎన్టీఆర్, రాంచరణ్ ఎలా ఉంటారు అనే ఆసక్తి తెలుగు సినీ ప్రేక్షకులందరిలో నెలకొంది ఉంది. 

రాజమౌళి మాత్రం లోలోపల ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. ఎప్పటిలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాటల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో మొత్తం 7 పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉంటాయట. 

ఇదిలా ఉండగా ఈ చిత్ర పాటల కోసం రాజమౌళి జాతీయ అవార్డు విజేత సుద్దాల అశోక్ తేజని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ తేజ ఆర్ఆర్ఆర్ మూవీలో 3 పాటలు రాయనున్నారు. అశోక్ తేజ ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించారు. 

RRR: డోస్ పెంచిన కీరవాణి.. జక్కన్న స్పెషల్ ఫోకస్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో 'నేను సైతం' అనే పాటకు సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. స్వాతంత్ర నేపథ్యంలో తెరక్కుతున్న చిత్రం కాబట్టి సాంగ్స్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించాల్సి ఉంది. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.