టాలీవుడ్‌ లో హీరోలుగా ఆకట్టుకుంటున్న స్టార్ హీరోలు నిర్మాతలుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఎక్కువగా నిర్మాతలుగా మారుతున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా హీరోగా ఎదుగుతున్న యంగ్ హీరో నాని. అష్మాచమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తరువాత టాలీవుడ్‌లో నేచురల్‌ స్టార్‌ గా ఎదిగాడు. తాను హీరోగా ప్రూవ్‌ చేసుకోవటమే కాదు తన లాంటి యంగ్ టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేసేందుకు  నిర్మాతగా మారాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా అనే బ్యానర్‌ స్థాపించి అ! అనే సినిమాను నిర్మించాడు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎక్స్‌పరిమెంటల్‌ మూవీకి మంచి పేరు వచ్చింది. అ! సినిమా తరువాత నిర్మాతగా షార్ట్ బ్రేక్ తీసుకున్న నాని ఇటీవల విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫలక్‌ నుమా దాస్ సినిమాతో హీరో గా సక్సెస్‌ సాధించిన విశ్వక్‌ సేన్ హీరో గా హిట్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా మంచి వసూళ్లు సాదిస్తుందనుకున్న సమయంలో కరోనా ప్రభావం సినిమా మీద పడింది. దీంతో కలెక్షన్లకు బ్రేక్ పడింది.

ఏప్రిల్ 1న హిట్ అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమాకు హిట్ టాక్‌ వచ్చినా శాటిలైట్ బిజినెస్ మాత్రం పూర్తి కాలేదు. ఈ సినిమా మాత్రమే కాదు నాని బ్యానర్ లో తెరకెక్కిన తొలి సినిమా అ! శాటిలైట్‌ బిజినెస్ కూడా ఇంకా కాలేదు. దీంతో కథ ఎంపికలో సక్సెస్ అవుతున్న నాని, సినిమా బిజినెస్ పూర్తి చేయటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడేమో అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.