నాని- సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ చిత్రం హిందీలో నికమ్మగా రీమేక్ అవ్వగా.. మేటి క్లాసిక్ నటి భాగ్య శ్రీ కుమారుడు అభిమన్యు దాసాని ఈ చిత్రంతో తెరకు పరిచయమవడంతో తెలుగు ఇండస్ట్రీలోనూ కొంత చర్చ సాగుతోంది. 

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎం.సి.ఎ’. దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. అప్పటికి నాని ‘నేను లోకల్’ ‘నిన్ను కోరి’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుని ఫామ్లో ఉండడం కలిసొచ్చింది. అలాగే ‘ఫిదా’ తో సాయి పల్లవి కూడా తెలుగులో ఓ రేంజిలో క్రేజ్ ను సంపాదించుకోవడంతో ‘ఎం.సి.ఎ’ పై భారీ అంచనాలు నమోదయ్యాయి. దాంతో రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో భారీ కలెక్షన్లు నమోదు చేసింది ఈ చిత్రం. ఇప్పుడీ చిత్రం హిందీలోకి రీమేక్ అయ్యింది. 

 ఎంసీఏ (నాని హీరో) రీమేక్ 'నికమ్మ' సినిమాతో అభిమన్యు దాసానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. భాగ్యశ్రీ కుమారుడు హీరోగా ఈ చిత్రం రూపొందింది. శ్రేయోభిలాషుల నుండి వార్మ్ వెల్ కం దక్కుతుందని భావించారు. అయితే ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వచ్చింది. తెలుగులో నాని చేసిన పాత్రను మక్కికి మక్కి మొహమాటం లేకుండా కాపీ కొట్టాడు. డైలాగ్స్ సైతం అలాగే ఉంచేసారు. తెలుగులో భూమిక చేసిన వదిన పాత్రను శిల్పా శెట్టి చేత చేయించారు. 

YouTube video player

అయితే సినిమా కు అవేమీ ప్లస్ కాలేదు. మినిమం ఓపినింగ్స్ కూడా దక్కలేదు. ఇంకా ఇలాంటి సినిమాలు ఏమి చూస్తాము అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు పెదవి విరిచేసారు. చాలా దారుణమైన రివ్యూలు వచ్చాయి. వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని తేల్చేసారు. ఇక ఓపినింగ్ రోజున పాతిక లక్షలు రెవిన్యూ వచ్చిందని ట్రేడ్ అంటోంది. నిజంగా అంత వచ్చిందంటే చాలా గొప్ప విషయం అంటున్నారు అక్కడ సినీ విశ్లేషకులు.

 అభిమన్యు దస్సాని- శిల్పా శెట్టి - షిర్లీ సెటియా నటించిన ఈ చిత్రం వినోదభరితమైన ప్రయాణంలా ప్లాన్ చేసారు కానీ ఆ మ్యాజిక్ తెరపై జరగలేదు. ఈ సినిమా షూటింగ్ కోవిడ్-19 సమయంలో రెండేళ్లపాటు సాగింది. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ప్రొడక్షన్ హౌస్ కూడా వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసారు. ఇందులో శిల్పాశెట్టి కుంద్రా- షిర్లీ సెటియా- సునీల్ గ్రోవర్- దీప్రాజ్ రాణా- నరేన్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నీకమ్మ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఒరిజినల్ చిత్రంతో పోలిస్తే ఎక్కువ డ్రామా - రొమాన్స్ జోడించారు. జూన్ 17న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసారు.