టాలీవుడ్ స్టార్స్ నాని, విజయ దేవరకొండ లు ఇద్దరికీ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. వీరిద్దరు కలిసి గతంలో ఎవడే సుబ్రమణ్యం చిత్రం చేసారు.అయితే అప్పటికి విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు. దాంతో ఇప్పుడు కలిసి నటిస్తే చూడాలని చాలా మందికి ఉంది. అయితే అందుకు తగ్గ కథ దొరకాలి. ఇద్దరినీ మేనేజ్ చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించే దర్శక,నిర్మాతలు కావాలి. అయితే ఇంతకాలానికి ఆ టైమ్ వచ్చిందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత, రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంటున్న సురేష్ బాబు ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఇందుకోసం ఓ హిందీ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది.  ఆ సినిమా మరేదో కాదు  ‘గుడ్ న్యూజ్’.
 
అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ధిల్జిత్ ధోసాంజె, కియారా అద్వానీ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గుడ్ న్యూజ్’. రాజ్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ భార్యాభర్తలు. కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టకపోవడంతో వీరు డాక్టర్ను కలుస్తారు. డాక్టర్ వారికి ‘ఇన్ విట్రో పెర్టిలైజషన్’ పద్ధతి ద్వారా పిల్లలను కానవచ్చని చెబుతారు.

అయితే వైద్యుల పొరపాటు వల్ల అక్షయ్ కుమార్ వీర్యాన్ని, ధిల్జిత్ ధోసాంజె భార్య కియారా అద్వానీ గర్భంలోకి.. అదే విధంగా ధిల్జిత్ ధోసాంజె వీర్యాన్ని కరీనా కపూర్ గర్భంలోకి ప్రవేశపెడతారు. సినిమాలో ఇరు జంటల పేర్లు కొంత వరకు ఒకే విధంగా ఉండడంతో ఈ పొరపాటు జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్, ఆపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 27 న సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయ్యింది.