లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి రొటీన్ కథలను కూడా సరికొత్తగా చెబుతూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె తెరకెక్కించిన 'ఓ బేబీ' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీని తరువాత ఆమె 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రీమేక్ చేస్తుందని భావించారు. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. 'మహానటి' సినిమా నిర్మించిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై సినిమా చేయడానికి అంగీకరించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సివుంది. మొదట్లో సినిమా చేస్తానని చెప్పిన విజయ్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో నందిని రెడ్డికి హ్యాండ్ ఇచ్చేశాడు. ఆ కారణంగానే నందిని రెడ్డి తన సినిమాలో హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు.

తాజాగా ఈ సినిమాలో హీరోగా నానిని తీసుకున్నట్లు సమాచారం. గతంలో నందిని రెడ్డి, నాని  కాంబినేషన్ లో 'అలా మొదలైంది' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఓ లేడీ డైరెక్టర్ యూత్ ఫుల్, సరదా సినిమా తీసి సక్సెస్ కొట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఇటీవల 'గ్యాంగ్ లీడర్' సినిమాతో సక్సెస్ అందుకున్న నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత నందిని రెడ్డి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తాడని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.