సీనియర్ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఓ పక్క రాజకీయాల పరంగా బిజీగా ఉన్నా.. నటనని మాత్రం విడిచిపెట్టలేదు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు 'రూలర్' సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.

అలానే తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. ఇది ఇలా ఉండగా.. బాలకృష్ణ మరో సినిమాపై కూడా దృష్టి పెడుతున్నాడని సమాచారం. చాలా రోజులుగా బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

2019 ఫోర్బ్స్ లిస్ట్: టాప్ 100లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్

నిజానికి బాలయ్య 100వ చిత్రంగా 'ఆదిత్య 999' రావాల్సింది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా అప్పట్లో బాలయ్యతో మంతనాలు జరిపారు కానీ ఊహించని విధంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడంతో 'ఆదిత్య 999' ఊసు లేకుండా పోయింది.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు వెళ్తుందని సమాచారం. బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2020లో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చవచ్చు. ఆదిత్య 369లో భూత, భవిష్యత్తు, వర్తమానాల్ని చూపించారు. 'ఆదిత్య 999' కథ మాత్రం వర్తమానం వైపే ఉంటుందని తెలుస్తోంది. బోయపాటి సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.