టాలీవుడ్ సీనియర్ నటుడు  మన్నవ బాలయ్య (Mannava Balayya) మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు చింతిస్తున్నారు. తాజాగా నందమూరి  బాలకృష్ణ, నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ నివాళి అర్పించారు.  

తెలుగు చలన చిత్ర  పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్న సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) (Mannava Balyya Death) నేడు తుదిశ్వాస విడిచారు.  కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో  తుదిశ్వాస విడిచారు.  మన్మధుడు, పాండు రంగడు, మల్లీశ్వరి లాంటి చిత్రాల్లో బాలయ్య నటించారు. అయితే ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు చింతిస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  

తాజాగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) మన్నవ బాలయ్య మరణ వార్త విని చలించి పోయారు. ఈ సందర్భంగా ఆయన  మృతికి చింతిస్తూ నివాళి అర్పించారు. బాలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నోట్ రిలీజ్ చేశారు. ‘సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండ నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురద్రుష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు  నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అంటూ భావోద్వేగ భరితంగా ప్రకటన విడుదల చేశారు. 
 
అలాగే నటుడు, దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ కూడా స్పందదించారు. మన్నవ బాలయ్య మరణ వార్త విని బాధపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ‘ప్రముఖ నటులు, దర్శకులు, అమృతాఫిలిమ్స్ అధినేత  శ్రీ బాలయ్య గారి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ  ఆ భగవంతుడ్ని  ప్రార్ధిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. అదేవిధంగా మరికొంత మంది ప్రముఖులు కూడా బాలయ్యకు నివాళి అర్పించారు.