జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా జడ్జ్ గా కొనసాగిన నాగబాబు ఎట్టకేలకు ఆ షోకు ఎండ్ కార్డ్ పెట్టేసిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల నుంచి ఆయన షో నుంచి తప్పుకుంటున్నారు అనే కామెంట్స్ కి నాగబాబు రంగంలోకి దిగి కుండబద్దలు కొట్టేశారు. ఇక ఆయన తప్పుకోవడానికి గల కారణాలను చెబుతూ.. షోపై అనేక రకాల కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారుస్తున్నారు.

ఆయన స్పెషల్ గా తన యూ ట్యూబ్ ఛానెల్ లో షోకి సంబందించిన విషయాలని చెబుతూ.. రోజుకో సంచలనానికి దారి తీస్తున్నారు. ఇకపోతే ఇటీవల మల్లెమాల యాజమాన్యంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. షోని ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల యూనిట్ లోని కొంతమంది మధ్యవర్తులు చెడగొట్టారని అన్నారు. నిర్మాత మెల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి జరిగిన విషయాలు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అది అనవసరమని పట్టించుకోలేదో ఏమిటో గాని మధ్యలో ఉన్న కొంతమంది కారణంగా జబర్దస్త్ తన ఉనికిని కోల్పోతోందని మెగా బ్రదర్ కామెంట్ చేశారు.  

నాగబాబు మాట్లాడుతూ.. పైకి ఏమి కనిపించకపోయినా నేను తెర వెనుక షో కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పటికి కూడా చాలా మంది ఫోన్ చేసి జబర్దస్త్ షోలో మీరు లేనందుకు చూడలేకపోతున్నాం, సార్ అంటూ ఫోన్ చేస్తున్నారు. నా వరకు నాతో అంతా బావుండేవారు.. బాగానే చూసుకున్నారు. కానీ చుట్టుపక్కల షో కోసం కష్టపడేవాళ్ళపై ట్రీట్మెంట్ దారుణంగా ఉండేది.

షోలో ఉన్నవాళ్లకు ఏం జరిగినా తమకెందుకులే అని పట్టించుకునేవాళ్ళు కాదు. వేణు పై దాడి జారిగినప్పుడు కూడా మల్లెమాల నుంచి ఎవరు స్పందించలేదు. అప్పుడు నేనే ముందుకు వెళ్ళాను. చాలా మంది విషయాల్లో మల్లెమాల తీరు ఇలానే ఉండేది. వేణు - ధనరాజ్ అలాగే మరికొంతమంది షో నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా ఓ విధంగా ఇక్కడి మధ్యవర్తులే అని నాగబాబు వివరించారు.