మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ నుంచి వైదొలిగిన తర్వాత నాగబాబు అందుకు గల కారణాలని ఒక్కొక్కటిగా తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొంటున్నారు. నాగబాబు మాటలని బట్టి చూస్తే యాజమాన్యంతో తలెత్తిన విభేదాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. 

జబర్దస్త్ యాజమాన్యం పక్కా కార్పొరేట్ సంస్థలా వ్యవహరించిందని, జబర్దస్త్ నటుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోలేదని నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జబర్దస్త్ లో ఎదురైన అనుభవాలని పంచుకున్నారు. జబర్దస్త్ నటులతో తాను ఎంత సన్నిహితంగా మెలిగానో కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చారు. 

'నాతో పాటు జడ్జిగా వ్యవహరించిన రోజా కూడా జబర్దస్త్ నటులతో సన్నిహితంగానే ఉండేవారు. కానీ నా అంత క్లోజ్ గా రోజా వారితో లేరు. రోజాకు రాజకీయ పరమైన పనులు కూడా ఉండడంతో షో అయిపోగానే వెళ్ళిపోయేవారు. పలు సందర్భాల్లో రోజా తనతో ఎమోషనల్ గా కొన్ని సంగతులు చెప్పింది. నగిరిలో తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ ఇమేజ్ చాలా బాగా ఉపయోగపడిందని తెలిపింది. ఇలా తామంతా జబర్దస్త్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం. 

ఓ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ ఓ రాజకీయ నాయకుడిపై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. దీనితో అతడిని జబర్దస్త్ షో నుంచి తీసేశారు. ఆ విషయం నాకు తెలిసింది. బుల్లెట్ భాస్కర్ ని తిరిగి తీసుకోకుంటే నేను కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంటానని చెప్పా. దీనితో భాస్కర్ ని మళ్ళీ తీసుకున్నారు. 

ఇలాంటి పరిస్థితే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లకు కూడా ఎదురైంది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వేరే ఛానల్స్ లో షోలు చేస్తున్నారని వారిని కూడా తీసేద్దామని అనుకున్నారు. వారు వేరే ఛానల్ లో జబర్దస్త్ లాంటి షో చేస్తే తప్పు.. కానీ వారిద్దరి వేరు వేరు షోలు చేస్తున్నారు. అలాంటప్పుడు తీసేయడం కరెక్ట్ కాదని యాజమాన్యానికి చెప్పా'అని నాగబాబు అన్నారు. 

యాంకర్ రష్మీ గురించి మరో సంఘటనని నాగబాబు పంచుకున్నారు. జబర్దస్త్ టీమ్స్ సహజంగానే రష్మిపై జోకులు వేస్తుంటారు. చాలా వరకు అవి సరదాగానే ఉంటాయి. కానీ ఓ టీం చేసిన స్కిట్ లో రష్మీపై దారుణమైన సెటైర్లు వేశారు. స్కిట్ అయిపోయేవరకు సైలెంట్ గానే ఉన్నా. స్కిట్ అయ్యాక అందరిని బయటకు పంపి వారిని తిట్టి వార్నింగ్ ఇచ్చానని నాగబాబు పేర్కొన్నారు.