యంగ్ హీరో నాగ శౌర్య (Naga Shaurya) నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. గతంలో మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా రిలీజ్ డేట్ పై అప్డేట్ అందించారు.
నాగశౌర్య వరుస సినిమాలతో జోరు పెంచారు. అశ్వద్దామ, లక్ష్య మూవీలతో యాక్షన్ సీన్లను చూపించే ప్రయత్నం చేసినా.. కొంత బెడిసికొట్టడంతో ఇక ఫ్యామిలీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీల వైపు ఫోకస్ పెట్టాడు. ఈ జోనర్ లో ఇటీవల వచ్చిన ‘వరుడు’ కావలెను మూవీతో మళ్లీ మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ ఏడాది నాగశౌర్య ఏకంగా నాలుగు చిత్రాల్లో నటుస్తున్నాడు. వీటిలో ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. కాగా.. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. లవర్ బాయ్ గా నాగశౌర్య కనిపించనున్న ఈ మూవీ పోస్టర్, టైటిల్ ఆసక్తిగా ఉన్నాయి.
తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఏప్రిల్ 22న థియేటర్స్ లో చిత్రం రిలీజ్ కానుందని అప్డేట్ అందించారు. ఈ మేరకు నాగశౌర్య, షిర్లీ సెటియాలతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య, హీరోయిన్ షిర్లీ సెటియాలు రొమాంటిక్ స్టిల్ లో ఆకట్టుకుంటున్నారు. శౌర్య మరియు షిర్లీ సెటియా ఇద్దరూ పెళ్లి దుస్తులలో బైక్ పై వెళ్తూ కనిపిస్తున్నారు. నాగశౌర్య నుదిట తిలకం దిద్దుకుని ఇన్నోసెంట్ లవర్ బాయ్ గా కొత్త అవతారమెత్తబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో నాగశౌర్య చాలా మంది అమ్మాయిలతోనే లవ్ ట్రాక్ నడిపించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదల కానుంది.
‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో పాటు ఈ ఏడాది నాగశౌర్యకు సంబంధించి మరో మూడు సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఫలాన అబ్బాయి.. ఫలాన అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నాగశౌర్య నటిస్తున్నారు. ఈ మూవీలు ప్రస్తుతం చిత్రీకరణ పనులను వేగంగా జరుపుకుంటోంది. త్వరలో వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నాయి.
