అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యువ నటుడు నాగ చైతన్య. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ తో వరుస విజయాలు సాధిస్తున్న ఈ యంగ్ హీరో టాలీవుడ్‌ యంగ్‌ జనరేషన్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్నాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ డ్రామాలతో ఆకట్టుకుంటున్నాడు చైతూ. ఇటీవల మజిలీ సినిమాతో తనలోని నటుడ్ని సరికొత్తగా ఆవిష్కరించిన చైతూ, ప్రస్తుతం లవ్‌ స్టోరి సినిమాలో నటిస్తున్నాడు.

కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత చైతూ చేయబోయే సినిమా పై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ను ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై నిర్మించనున్నారు. ఈ సినిమా బాలీవుడ్‌ సూపర్‌ హిట్ చిచోరేకు రీమేక్‌గా తెరెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ అప్‌ డేట్ తెర మీదకు వచ్చింది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. గతంలో వీరి కాంబినేషన్‌ లో వచ్చిన మనం ఇండస్ట్రీ హిట్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తరువాత ఇదే కాంబినేషన్‌ లో మరో సినిమా తెరకెక్కుతున్నట్టుగా వార్తలు రావటంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కానీ మనం తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య, విక్రమ్‌తో సినిమా చేయటం అవసరమా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా విక్రమ్ ఈ సినిమాతో నాగ చైతన్య సినిమా అన్న వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో తెగ హల్ చల్ చేస్తోంది.