యువ దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాతో పాపులారిటీ దక్కించుకున్నాడు. తెలుగులో వచ్చిన ఈ సినిమా భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఎన్నో అవార్డులు, గౌరవాలు లభించాయి.

అయితే ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా.. నాగ్ అశ్విన్ మరో సినిమా ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతుందని అన్నారు.

ఇప్పుడు ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చేసింది. నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేయబోతున్నట్లు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.  చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్. ఇప్పుడు అందుకు తగ్గ భారీ కథను కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్.. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి.