రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా సైరా తర్వాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. 

చిరంజీవి తదుపరి చిత్రాలపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ సమయంలో చిరంజీవి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ని ప్రత్యేకంగా అభినందించారు. నాగ్ అశ్విన్ దర్శత్వంలో నటించాలని ఉన్నట్లు తన కోరికని బయటపెట్టారు. 

ఆ సమయంలో నాగ్ అశ్విన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలని వైజయంతి సంస్థ ఖండించింది. తాజాగా మరో ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది. 

నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆసక్తికర కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్ మెషీన్ నేపథ్యంలో ఓ కథని నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నాడట. ఈ కథకు ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది.. విజువల్స్, గ్రాఫిక్స్ లాంటి టెక్నికల్ అంశాలు ఏమేరకు అవసరం అవుతాయి.. ఈ కథ వర్కౌట్ అవుతుందా అనే ప్రాధమిక అంశాలపై నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

టైమ్ మెషీన్ నేపథ్యంలో గతంలో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ కాన్సెప్ట్ ని నాగ్ అశ్విన్ మరోమారు తెరమీదికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అంతా ఒకే అనుకున్న తర్వాతే మెగాస్టార్ కు కథ వినిపించాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నాడట. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ మరో చిత్రానికి కమిట్ కాలేదు. మెగాస్టార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై నిజంగానే వర్క్ జరుగుతోందా లేక ఇది ఊహాగానం మాత్రమేనా అనేది త్వరలో తేలనుంది.