ఒకప్పుడు సంక్రాంతి రాజు గా పిలవబడ్డ ఎమ్ ఎస్ రాజు వరస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయారు. అయితే ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగానూ పడిపోయిన నిర్మాతగా మిగిలిపోయారు. వెంకటేష్ చేసిన ‘శత్రువు’ సూపర్ హిట్ అవటంతో ....ఆ తర్వాత... , పోలీస్ లాకప్, దేవి చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. ఆయన స్పీడ్‌కు దేవీపుత్రుడు చిత్రం బ్రేక్‌వేసింది. ఆ టైంలో సిద్ధార్థ -త్రిష కెమిస్ట్రీ ఫీస్ట్‌గా వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మళ్లీ యంఎస్ రాజుని నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టింది.

 2001 నుంచి 2005 వరకూ వరుస హిట్లుకొట్టిన రాజు -ప్రభాస్‌తో చేసిన ‘పౌర్ణమి’ సక్సెస్‌కు మళ్లీ బ్రేక్ వేసింది. దర్శకుడు ఎవరైనా అన్నీ తనే దగ్గరుండి చూసుకునే రాజు -తరువాత  డైరక్టర్ గా మారారు. అయితే అప్పటి నుంచే ఆయన పరిస్దితి మరీ దారుణం అయ్యిపోయింది. కొడుకు సుమంత్ అశ్విన్‌ను హీరోగా అరంగేట్రం చేయించి నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే అదీ వర్కవుట్ కాలేదు.

హిట్లు పడుతున్నా.. స్పీడ్ పెంచని స్టార్ హీరోలు!

దాంతో గ్యాప్ తీసుకుని ఆ మధ్యన ఎమ్‌.ఎస్‌.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్‌' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్‌, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారనే టాక్ వచ్చింది.

 ఆ తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న రాజుగారు తాజాగా ఈ కొత్త ఏడాదిలో యంఎస్ రాజు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ఇపుడు ఆసక్తి పెంచుతోంది. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూనే ‘అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా. షాకవ్వకండి’ అంటూ ట్వీట్ పెట్టారు యంఎస్ రాజు. యంఎస్ రాజు ఇక సినిమాలు తీయకపోవచ్చు అని ఫిక్సైన జనాలకు షాక్ ఇచ్చేలా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆయన చేయబోయే అనౌన్స్‌మెంట్ ఏమిటనేది చూడాలి. అలాగే నిజంగా షాక్ ఇచ్చే ఎనౌన్సమెంట్ అవుతుందా లేదా అనేది ఇంట్రస్టింగ్ విషయం.