కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మోహన్ బాబు చంద్రబాబుని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబుపై మోహన్ బాబు తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. 

ఇటీవల చంద్రబాబు ఓ సందర్భంగా మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అని విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'చంద్రబాబు ఎన్నికలు అయిపోయాయి.. ఎవరి దారిలో వాళ్ళం ఉన్నాం. అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి సమయంలో మరోసారి నా మనసుని  ఇబ్బంది పెట్టేవిధంగా మాట్లాడావు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని విమర్శించావు. 

ఆ వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నా మనసు గాయపడింది. అన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు నా చిత్ర పరిశ్రమ మొత్తానికి నేనేంటో తెలుసు. ప్రతి ఒక్కరు మోహన్ బాబు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పారు.. చెబుతూనే ఉంటారు. నా గురించి అందరికీ తెలుసు. 

క్రమశిక్షణ, స్నేహం అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. దయచేసి ఇక మీదట నా పేరుకు భంగం కలిగించేలా మాట్లాడవద్దు. అది నీకూ నాకూ మంచిది. ఏదైనా సందర్భంలో ఎదురుపడితే సరదాగా మాట్లాడుకుందాం.. అది కూడా నీకు ఇష్టమైతేనే అని మోహన్ బాబు ట్విటర్ లో చంద్రబాబుపై కామెంట్స్ చేసారు. 

ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే మోహన్ బాబు ఆయనతో మేజర్ చంద్రకాంత్ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీవిద్యానికేతన్ సంస్థకు రావలసిన ఫీజు బకాయిల విషయంలో మోహన్ బాబు ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు వైసిపిలో కొనసాగుతున్నారు.